AP Minister Botsa: ఐదేళ్లలో రెండున్నర రెట్లు పెరిగిన బొత్స కుటుంబం ఆస్తులు

  • 2019లో రూ.8 కోట్లు.. 2024 లో రూ.21 కోట్లు
  • అఫిడవిట్ లో వెల్లడించిన బొత్స
  • చీపురుపల్లి నుంచి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ నేత
AP Minister Botsa Satyanarayana Assets Increased Two and Half Times within 5 Years

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆస్తులు ఐదేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగాయి. 2019లో బొత్స కుటుంబ ఆస్తుల విలువ రూ.8.23 కోట్లు కాగా ప్రస్తుతం వాటి విలువ రూ.21.19 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తన అఫిడవిట్ లో వెల్లడించారు. ఈమేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తనతో పాటు తన భార్య పేరుమీద ఉన్న ఆస్తుల చిట్టాను వెల్లడించారు. మంత్రి పేరుమీద ఉన్న చరాస్తుల విలువ రూ.3.78 కోట్లు కాగా ఆయన భార్య ఝాన్సీలక్ష్మి పేరుతో రూ.4.75 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అవిభక్త కుటుంబానికి రూ.35.04 లక్షల ఆస్తి ఉంది.

స్థిరాస్తుల విషయానికి వస్తే.. బొత్స పేరుతో రూ.6.75 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, ఝాన్సీలక్ష్మి పేరుమీద రూ.4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరుమీద రూ.1.08 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని చెప్పారు. మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.21.19 కోట్లు అని అఫిడవిట్ లో మంత్రి వెల్లడించారు. అయితే, 2019 లో ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.. బొత్స కుటుంబ ఆస్తుల విలువ రూ.8.23 కోట్లు మాత్రమే. అప్పట్లో మంత్రి పేరు మీద రూ. రూ.15.95 లక్షల విలువైన కారు, రూ.20.15 లక్షల విలువైన బంగారం (31 తులాలు), ఝాన్సీలక్ష్మికి రూ.73.33 లక్షలు, రూ.8 లక్షల విలువైన రెండు కార్లు, రూ.2.11 కోట్ల విలువైన బంగారం (325 తులాలు) ఉంది. అప్పుల విషయానికి వస్తే.. మొత్తం అప్పులు రూ.4.24 కోట్లు కాగా అందులో కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న అప్పులే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

More Telugu News